‘పెట్రో’ ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటా ఇది
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్రం తెలిపింది. దీంట్లో రూ.20 వేల కోట్లు రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధనమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇవాళ ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రాలకు కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకంలో మాత్రమే వాటా ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.1.40గా ఉంది. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ.11, రోడ్లు, మౌలిక వసతుల సెస్సు కింద రూ.13, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సు కింద రూ.2.50 వసూలు చేస్తున్నారు. ఇదంతా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. రాష్ట్రాలకు వాటా ఉండదు. అలాగే డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.1.80గా ఉండగా.. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద 8 పైసలు, రోడ్డు మౌలిక వసతుల సెస్సు కింద నాలుగు పైసలతో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సును కూడా విధిస్తున్నారు.