ఎల్‌ఐసీ విలువ సగానికి పైగా కోత?
ఎల్‌ఐసీలో వాటా అమ్మడం ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం చివరికి ఆ సంస్థ విలువను భారీగా తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో తొలుత అనుకున్న వ్యాల్యూయేషన్‌తో ఎల్‌ఐసీ ఐపీఓ సక్సెస్ కాదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎల్‌ఐసీ విలువను తగ్గించి షేర్లను జారీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 60,000 కోట్లు సమీకరించాలని భావించిన కేంద్రం… ఇపుడు రూ. 30,000 కోట్లకే సరిపెట్టుకోవడానికి సిద్ధపడింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటా విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. గతంలో ఎల్‌ఐసీ విలువ రూ.17 లక్షల కోట్లుగా లెక్కించిన ప్రభుత్వం ఇపుడు ఆ సంస్థ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగడుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. కారు చౌకగా ఎల్‌ఐసీ వాటా అమ్మేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోందన్నమాట. పబ్లిక్ ఇష్యూ కోసం ఇప్పటికే సెబి నుంచి తీసుకున్న అనుమతికి గడువు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో మళ్ళీ అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది.