ఎల్‌ఐసీ షేర్లు: నష్టాల్లో లిస్ట్ కానున్నాయా?
ఊహించినట్లే ప్రైమరీ మార్కెట్ మరీ బలహీనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన ఎల్‌ఐసీ.. ఏదోవిధంగా పూర్తయినా.. లిస్టింగ్ రోజున ఈ షేర్ నష్టాల్లో ప్రారంభమౌతుందా అన్న టెన్షన్ పట్టుకుంది ఇన్వెస్టర్లకు. ఎందుకంటే ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ప్రక్రియ ప్రారంభ సమయంలో షేర్‌కు అనధికార మార్కెట్‌లో ప్రీమియం రూ. 93 నుంచి రూ.95 పలికింది. అంటే లిస్టింగ్ రోజున ఈ షేర్ ధర రూ.1000 దాటుతుందని ఆశించారు. అయితే పబ్లిక్ ఆఫర్ ఓపెన్ అయిన తరవాత ట్రెండ్ మారుతూ వచ్చింది. దీనికి కారణం.. సెకండరీ మార్కెట్ చాలా వీక్‌గా ఉండటం. నిఫ్టి ఇవాళ 16000 దగ్గరకు వచ్చేసింది. అనేక మంది అనలిస్టులు ఈ డౌన్ ట్రెండ్‌లో నిఫ్టి 15400- 15450 దాకా వెళ్ళే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్‌కు అనధికార మార్కెట్‌లో ఉన్న ప్రీమియం కాస్త పోయి… షేర్ ధర నెగిటివ్‌లోకి వచ్చేసింది. ఎల్‌ఐసీ షేర్లను రూ. 902 – రూ. 949 లకు ఆఫర్ చేసింది. గరిష్ఠ ధర ఖరారు చేసినా.. ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ పోగా రూ.904లకు కేటాయించే అవకాశముంది. అయితే ఇపుడు అనధికార మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేర్ రూ.890 వద్ద పలుకుతోంది. అంటే లిస్టింగ్ రోజు నష్టాలు తప్పవా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో వైరల్‌గా మారింది. అయితే లిస్టింగ్ రోజుకు సెకండరీ మార్కెట్‌ను బట్టి షేర్ ధర మారే అవకాశముంది.