For Money

Business News

మార్కెట్‌ జూమ్‌… ఎల్‌ఐసీ డౌన్‌

స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని, అందుకే డిస్కౌంట్‌కు షేర్లు ఇస్తున్నామని పబ్లిక్‌ ఆఫర్‌ సమయంలో ప్రభుత్వ అధికారలు తెగ ప్రచారం చేశారు. తీరా లిస్టయిన తరవాత మార్కెట్‌ బాగున్నా… షేర్‌ నష్టాల్లో ట్రేడవడంతో ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు షాక్‌ తింటున్నారు. నిఫ్టి ఏకంగా 350 పాయింట్లు పెరిగిన నేపథ్యంలో కూడా షేర్‌ రూ.10పైగా నష్టంతో రూ. 827కు చేరింది. షేర్‌ భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో కంగారు కనిపిస్తోంది. మార్కెట్‌లో ఇన్సూరెన్స్‌ రంగానికి చెందిన షేర్లు కూడా పెద్దగా లేవు. పైగా ఎల్ఐసీ జారీ చేసిన ఈక్విటీ కూడా చాలా తక్కువ. అందులో రీటైల్‌, ఉద్యోగులు, పాలసీ హోల్డర్ల షేర్లే ఇపుడు మార్కెట్‌లో ఉన్నాయి. ఇతర ఇన్వెస్టర్ల షేర్లపై లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఉంది. ఇలాంటి సమయంలో కూడా షేర్‌ భారీగా పతనం అవుతోందంటే… కావాలని షేర్‌ను పడగొట్టి… తక్కువ ధరకు కొనేందుకు పెద్ద ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తున్నారా అన్న వదంతులు ఇపుడు మార్కెట్‌లో ప్రచారంలో ఉన్నాయి. ఎల్‌ఐసీ షేర్‌ టార్గెట్‌ రూ.750 అన్న వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి వదంతులను చిన్న ఇన్వెస్టర్లను హడలెత్తిస్తున్నారు. మార్కెట్‌ పడినపుడే కాకుండా… ర్యాలీ సమయంలో కూడా షేర్‌ ధర పెరగకపోతే.. కొత్త ఇన్వెస్టర్లు భయంతో షేర్లను అమ్ముకుంటారు. ఆ షేర్లను పెద్ద ఇన్వెస్టర్లు కొంటారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ నడుస్తున్నట్లు కన్పిస్తోంది. అనలిస్టులు మాత్రం ఎల్‌ఐసీ షేర్లను అమ్మొద్దని… ఒకవేళ భారీగా తగ్గితే మరిన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలానికి ఎల్‌ఐసీ మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని అంటున్నారు.