కేన్స్ ముంచేసింది?
ఇవాళ కూడా కేన్స్ టెక్నాలజీస్ 12.55 శాతం క్షీణించింది. గత అయిదు రోజుల్లో ఈ షేర్ 21 శాతం తగ్గింది. గత నెల రోజుల్లో 31 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.3825 ఉన్న ఈ షేర్ … అక్టోబర్ నెలలో రూ. 7822ని తాకింది. అయితే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తప్పుల తడక అని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కొటక్ సెక్యూరిటీస్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్‌పై ఇచ్చిన నివేదిక మార్కెట్‌లో కలకలం రేపింది. కేన్స్ కంపెనీ, తన అనుబంధ కంపెనీ Iskraemeco మధ్య జరిగిన లావాదేవీలను కేన్స్ కావాలని తొక్కిపెట్టింది. కేన్స్ నుంచి రూ. 180 కోట్ల విలువైన కొనుగోళ్ళ చేశానని, అదే కంపెనీకి రూ. 320 కోట్లు, కేన్స్ ఎలక్ట్రానిక్స్ మాన్యూఫ్యాక్చరింగ్ అనే కంపెనీకి మరో రూ. 180 కోట్లు బకాయి ఉన్న విషయం కూడా దాచారు. కేన్స్ టెక్నాలజీస్ నుంచి తనకు రూ. 190 కోట్లు రావాల్సి ఉందని Iskraemeco తన ఖాతాల్లో చూపింది. అయితే ఇవేవీ కేన్స్ ఖాతాలో లేవు. ఇదే విషయాలను కొటక్ సెక్యూరిటీస్ బయటపెట్టింది. ఇవన్నీ పొరపాటు తాము పొందుపర్చలేకపోయాని కంపెనీ ఇవాళ వివరణ ఇచ్చింది. అంటే ఈ గణాంకాలన్నీ కరక్ట్ అని కంపెనీ పరోక్షంగా అంగీకరించింది. దీంతో ఇవాళ ఈ కౌంటర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మరోవైపు జేపీ మోర్గాన్‌పై కూడా ఇవాళ ఓ నివేదిక ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ రూ. 7550 అవుతుందని చెబుతూనే… ప్రస్తుత ధర వద్ద మాత్రం కొనుగోలు చేయొద్దని సలహా ఇచ్చింది. బాటమ్ ఫిషింగ్ వొద్దని చెప్పడమంటే… ఈ షేర్ ఇంకా పడుతుందని హెచ్చరించడమేనని అనలిస్టులు అంటున్నారు. కేవలం రెండు నెల్లో కేన్స్ షేర్ ధర దాదాపు సగానికి పడిపోవడంపై ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అవుతోంది. న్యూఏజ్ రంగానికి చెందిన కేన్స్ టెక్నాలజీస్ డేటా సెంటర్లను పెడుతోంది. తొలుత హైదరాబాద్‌లో పెడతామని చెప్పి… తరవాత యూనిట్‌ను గుజరాత్‌కు తరలించింది. ఈలోగా విద్యుత్ మీటర్లను తయారు చేసే Iskraemeco కంపెనీని టేకోవర్ చేసింది. అయితే మార్కెట్‌లో CMS రంగానికి చెందిన టాప్ కంపెనీ అని చాలా బ్రోకింగ్ సంస్థలు కితాబు ఇచ్చాయి. చాలా మంది అనలిస్టులు కూడా దీర్ఘకాలానికి కొనమని సలహా ఇచ్చారు. అలా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇపుడు లబోదిబో అంటున్నారు. షేర్ చాలా ఫాస్ట్‌గా పడటంతో… ట్రేడర్లు కూడా ఖంగుతిన్నారు. దీంతో మొత్తం న్యూఏజ్ రంగానికి చెందిన షేర్లపై ఇన్వెస్టర్లలో అనుమానం వస్తోంది. న్యూఏజ్ రంగానికి చెందిన షేర్లను గుడ్డిగా కొనుగోలు చేయొద్దని, అన్ని రంగాల గణాంకాలు చూసిన తరవాతే… విశ్లేషించి కొనాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు సలహా ఇస్తున్నారు.
