డెరివేటివ్స్ ఎఫెక్ట్

ఇవాళ మార్కెట్ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. జవనరి సిరీస్ భారీ నష్టాల్లో ముగిసినా.. చివరి ట్రేడింగ్ సెషన్ మాత్రం లాభాల్లో ముగిసింది. ఇవాళ నిఫ్టి చివరి గంటల్లో డెరివేటివ్ ఇన్వెస్టర్ల ప్రీమియంను మింగేసింది. మిడ్ సెషన్‌లో 23322 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి… అక్కడి నుంచి క్రమంగా పడుతూ వచ్చింది. సరిగ్గా 2.30 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. అప్పటి వరకు చాలా వరకు అట్ ద మనీ ప్రాంతంలో ఉన్న షార్ట్ పొజిషన్స్ జీరో కాగా… 2.30 ప్రాంతానికల్లా లాంగ్ పొజిషన్స్ ప్రీమియం కరిగి పోయింది. అక్కడి నుంచి అసలు బ్రోకర్ల పండగ ప్రారంభమైంది. చివరి అరగంటలో నిఫ్టి భారీ లాభాలను పొందింది., 23139 నుంచి 23594 దాకా వెళ్ళింది. కాని జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ కొన్నవారు పెద్దగా లాభపడలేదు. పైగా చివరి అరగంట వ్యాల్యూ ఆధారంగా క్లోజింగ్ ధర నిర్ణయం కావడంతో నిఫ్టి క్లోజింగ్ 23249కి చేరింది. దీంతో చాలా వరకు ప్రీమియంలు పోయాయి. ఇలా ఇవాళ ట్రేడ్ మొత్తం సూచీలు, వాటి ఆధారిత షేర్లపైనే సాగింది. అందుకే బ్యాంక్ నిఫ్టిలో పెద్ద లాభం లేదు. అలాగే మిడ్ క్యాప్స్ నష్టాల్లో ముగిశాయి. అలాగే స్మాల్ క్యాప్స్ కూడా. ఎఫ్‌ఎంసీజీ షేర్లకు గట్టి మద్దతు లభించినా ట్రెంట్ షేర్ ఒక శాతంపైగా నష్టపోయింది. ఇవాళ 2901 షేర్లు ట్రేడవగా, 1549 షేర్లు లాభాలతో ముగిశాయి. అయితే 18 షేర్లు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని తాకాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఇక 64 షేర్లు 52వారాల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. సో… నిఫ్టిపైకి గ్రీన్‌లో కన్పించినా… మెజారిటీ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి.