For Money

Business News

ఏజెంట్లకు అంత కమీషనా…కట్‌ చేయండి!

పాలసీ అమ్మే ఏజెంట్లకు బీమా కంపెనీలు భారీ మొత్తంలో కమీషన్లు ఇవ్వడంపై ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏజెంట్లకు ఇచ్చే కమీషన్‌కు సంబంధించి నిబంధనలు ఉన్నాయని… ఆ పరిమితికి మించి కమీషన్లు ఇవ్వడంపై తన అసంతృప్తిని బీమా కంపెనీలకు ఐఆర్డీఏ వ్యక్తం చేసింది. ఇటీవల బీమా కంపెనీల ప్రతినిధులతో ఐఆర్‌డీఏ భేటీ అయింది. వెంటనే ఏజెంట్లకు ఇచ్చే కమీషన్లను తగ్గించడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయమని ఆదేశించింది. బీమా రంగంలో ఏజెంట్లతో పాటు ఇంటర్మీడియటరీలు, అగ్రిగేటర్లు కూడా ఉంటారు. ప్రస్తుతమున్న పద్ధతికి బదులు ఇన్సూరెన్స్‌ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ సలహా ఇచ్చింది. ఈ బీమా ఎక్స్ఛేంజీలో అన్ని బీమా కంపెనీలకు చెందిన అన్ని రకాల అంటే జీవిత, సాధారణ బీమా పాలసీలు ఉంటాయి. ఈ ఎక్స్ఛేంజీలో ఏజెంట్లు సభ్యత్వం తీసుకుంటే చాలు. ప్రస్తుతం బీమా కంపెనీలు విడిగా తమకంటూ కొంత మంది ఏజెంట్లను పెట్టుకుంటున్నాయి. దీనికి భిన్నంగా అన్ని కంపెనీలు కలిసి ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేసి.. అందులో ఏజెంట్లకు సభ్యత్వం ఇవ్వమని ఐఆర్‌డీఏ అంటోంది. అంటే ఎక్స్ఛేంజీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఏజెంట్‌ ప్రతి బీమా పాలసీని అమ్మవచ్చన్నమాట. అలా చేస్తే ఎక్స్ఛేంజీ ఏజెంట్లకు తక్కువ కమీషన్‌ ఇచ్చినా సరిపోతుందని ఐఆర్‌డీఏ భావిస్తోంది. ఇపుడు ఇస్తున్న కమీషన్‌లో పదో వంతు ఏజెంట్లకు ఇచ్చినా చాలని అంటోంది. దీనివల్ల పాలసీదారులపై భారం తగ్గుతుందన్నమాట.