For Money

Business News

రూ. 40 లక్షల కోట్లు పాయే!

నిజంగా… కరోనా సమయంలో కూడా ఇన్వెస్టర్లు ఇంతగా భయపడలేదు. ఎందుకంటే అప్పటి పతనానికి కారణం ఉంది. జాగ్రత్తపడిన ఇన్వెస్టర్లు వెంటనే మార్కెట్‌ నుంచి బయటపడ్డారు.కాని ఈసారి అడ్డంగా బుక్కయ్యారు. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు కొన్న ఇన్వెస్టర్ల పోర్టు ఫోలియోలు ఐస్‌ ముక్కల్లా కరిగిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మిన ప్రతి రోజూ దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొన్నారు. మరి నిఫ్టి 2000 పాయింట్లు ఎందుకు పడింది? సాధారణ ఇన్వెస్టర్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు అమ్మడమే. సెప్టెంబర్‌ 27న నిఫ్టి ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిని తాకింది. అప్పటి నుంచి కేవలం 20 ట్రేడింగ్ సెషన్స్‌లో… అంటే గత శుక్రవారం నాటికి ఇన్వెస్టర్ల సంపద రూ.40 లక్షల కోట్లు తగ్గింది. ఇందులో నష్టాలు ఇంకా భరిస్తున్నవారు ఎందరో? అమ్ముకున్న బయటపడ్డవారు ఎందరో? ఈ ఒక్క నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు లక్ష కోట్ల రూపాయల షేర్లను నికరంగా అమ్మగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 96,000కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్నారు. దిగువస్థాయిలో బ్యాంక్‌ నిఫ్టికి కాస్త బలం ఉందని కొందరు అనలిస్టులు అంటున్నా… నిఫ్టి50 విషయానికొచ్చేసరికి పెదవి విరుస్తున్నారు. ఒకవేళ నిఫ్టి ఇక్కడి నుంచి పెరిగినా 24350 లేదా 24600 దాకా వెళ్ళొచ్చని, అంతకుమించి పైకి వెళ్ళడం కష్టమని అంటున్నారు. ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉండటం, నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున 24000 లేదా 23900 ప్రాంతంలో నిఫ్టికి గట్టి మద్దతు లభిస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు.