For Money

Business News

జీ ఇన్వెస్టర్లకు శుభ వార్త

నిన్నటి దాకా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌లో సెల్ సలహా ఇచ్చిన విశ్లేషకులు…ఇవాళ బై సిగ్నల్‌ ఇస్తున్నారు. కంపెనీ సీఈఓ, ఛైర్మన్ పునీత్‌ గోయెంకాతో పాటు ఇతర డైరెక్టర్లను తొలగించేందుకు అసాధారణ ఈజీఎం నిర్వహించాలని కంపెనీలో అతి పెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్కో ఫండ్‌ నోటీస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ పట్టించుకోలేదు. పైగా దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. అయితే డివిజన్‌ బెంచ్‌ సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేస్తూ… ఈజీఎం నిర్వహణ కోరే హక్కు ఇన్వెస్కోకు ఉందని పేర్కొంది. మరోవైపు సోనీతో కుదిరిన ఒప్పందం అమలవుతున్న సమయంలో ఇన్వెస్కో వ్యవహారం ఇన్వెస్టర్లకు షాక్‌ ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో జీ షేర్లను నిన్న అమ్మాల్సిందిగా డే ట్రేడర్లకు సలహా ఇచ్చారు. అయితే నిన్న రాత్రి ఇన్వెస్కో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈజీఎం నిర్వహించాలని తాము పట్టుపట్టమని పేర్కొంది. అయితే సోనీ, జీ మధ్య కుదిరిన ఒప్పందం అమలును చూస్తున్నామని పేర్కొంది. ఒప్పందం మేరకు విలీనం జరగకపోతే తాము కచ్చితంగా ఈజీఎం నిర్వహణ కోసం పట్టుబడుతామని పేర్కొంది. ఒప్పందం అమలుకు ఏడాది గడువు ఉన్నందున… ప్రస్తుతానికి ఈ షేర్‌కు ఇబ్బందులు తొలగినట్లే.