ఇంజినీర్లకు శుభవార్త
దాదాపు గత రెండేళ్ళ నుంచి ఐటీ రంగంలో కొత్త నియామకాలు లేవు. బ్లూచిప్ కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తొలగించడానికే మొగ్గు చూపాయి. కొత్తగా తీసుకున్నవారి కంటే తొలగించిన ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటూ వచ్చింది. చూస్తుంటే ఐటీ రంగానికి మంచి రోజులు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు త్రైమాసికాల తరవాత అంటే ఒకటిన్నర సంవత్సరాల తరవాత ఇన్ఫోసిస్ కొత్తగా ఉద్యోగులను తీసుకుంది. అంటే తొటగించిన వారి సంఖ్య తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,456 పెరిగింది. జూన్ నెలాఖరునాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,15,332 కాగా ఇపుడు ఆ సంఖ్య 3,17,788కి చేరింది. అయితే కంపెనీని వొదిలి వెళుతున్న ఉద్యోగుల సంఖ్య జూన్ నుంచి సెప్టెంబర్‌కు పెరిగింది. ఇంతకుమునుపు 12.7 శాతం కాగా, ఇపుడు 12.9 శాతమని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే గత ఏడాదిలో ఉన్న 14.6 శాతంతో పోలిస్తే ఇపుడు కంపెనీకి గుడ్‌బై చెబుతున్నవారి సంఖ్య తగ్గింది. టీసీఎస్‌లో కూడా ఈ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,726 మేర పెరిగి 6,12,724కు చేరింది. హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రం ఉద్యోగుల సంఖ్య 780 తగ్గి 2,18,621కి చేరింది.