For Money

Business News

సరకు రవాణా సంస్థగా ఇండియా పోస్ట్‌?

ఇండియా పోస్ట్‌ను సమూలంగా మార్చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా ఇండియా పోస్ట్‌ మారాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్‌ ఆదాయం రూ. 12000 కోట్లని.. దీన్ని రానున్న మూడు, నాలుగేళ్ళలో మరో 50 శాతం మేర పెంచేందుకు కృషి చేస్తున్నామని సింధియా అన్నారు. మెయిల్‌ బిజినెస్‌, లెటర్‌ బిజినెస్‌ నుంచి కంపెనీ ఓ లాజిస్టిక్‌ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం సంస్థ సిద్ధంగా ఉండాలని అన్నారు.మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులను పెడుతోందని, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. రూ. 48000 కోట్లతో రోడ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారని… ఇంకా 25000 గ్రామాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో 6000 గ్రామాలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ లేదని కేంద్ర మంత్రి అన్నారు.