ఆదాయంలో బీఆర్‌ఎస్ టాప్
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్‌ఎస్ టాప్‌లో నిలిచింది. ఆ ఏడాదికి సంబంధించి 39 ప్రాంతీయ పార్టీల ఆదాయాలను ఏడీఆర్ సంస్థ విడుదల చేసింది.39 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ. 1,740 కోట్లు కాగా… ఇందులో ఏకంగా 42.38 శాతం బీఆర్‌ఎస్‌దేనని పేర్కొంది. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో టాప్ 5 పార్టీల వాటా 88 శాతం పైగానే అని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ ఆదాయం రూ. 737.67 కోట్లని ఏడీఆర్ సంస్థ పేర్కొంది. (ఇందులో రూ. 529 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి) రూ. 333.45 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. రూ. 254 కోట్లతో డీఎంకే మూడో స్థానంలో నిలవగా.. నాలుగో స్థానంలో బీజేడీ నిలిచింది. ఈ పార్టీ ఆదాయం రూ. 181 కోట్లలు. తరవాతి స్థానంలో అంటే అయిదో స్థానంలో నిలిచిన వైకాపా ఆదాయం రూ. 74.78 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ. 680 కోట్లను ఖర్చు పెట్టకుండా బీఆర్‌ఎస్ తన ఖాతాలో ఉంచుకుంది. నిజానికి ఆదాయంలో టాప్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఖర్చు విషయంలో చాలా వెనుకబడింది. 2022-23లో తృణమూల్ కాంగ్రెస్ రూ. 184 కోట్ల ఖర్చుతో మొదటిస్థానంలో ఉండగా, రూ.79 కోట్ల ఖర్చుతో వైకాపా రెండో స్థానంలో నిలిచింది. రూ. 57 కోట్ల ఖర్చుతో బీఆర్‌ఎస్ మూడోస్థానంలో నిలిచింది. డీఎంకే రూ.52 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ రూ. 31 కోట్లు ఖర్చు పెట్టాయి. 2022-23లో టీడీపీ మొత్తం ఆదాయం రూ.63 కోట్లు కాగా, అదే ఏడాది పెట్టిన ఖర్చు రూ. 53 కోట్లు. 2021-22లో బీఆర్‌ఎస్ ఆదాయం రూ.218 కోట్లు కాగా, 2022-23లో రూ. 737 కోట్లకు చేరడం విశేషం.2022-23లో వచ్చిన మొత్తంలో రూ.683 కోట్లు విరాళాల రూపంలో వచ్చినవి కావడం విశేషం. ఇదే ఏడాది బీఆర్‌ఎస్‌కు వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.54 కోట్లు. ఇక ఖర్చుల విషయానికొస్తే వైకాపా ఏకంగా రూ. 77.39 కోట్లను పార్టీ కార్యక్రమాలకు, ప్రచారం కోసం ఖర్చు పెట్టినట్లు పేర్కొంది. బీఆర్‌ఎస్ మాత్రం పార్టీ నిర్వహణ, సాధారణ ఖర్చుల కింద రూ. 40 కోట్లు ఖర్చు పెట్టినట్లు తన ఖాతాల్లో పేర్కొందని ఏడీఆర్ తెలిపింది.