For Money

Business News

పారిశ్రామిక వృద్ధి మైనస్‌ 4 శాతం

అక్టోబర్‌లో కీలక పరిశ్రమలన్నీ పడకేయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్‌ 4 శాతానికి క్షీణించింది. సీఎన్‌బీసీ టీవీ 18 సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు ఐఐపీ 0.8 శాతం క్షీణించవచ్చని భావించారు. అంటే ఒక శాతం కంటే తక్కువగా పడుతుందని అంచనా వేశారు. వాస్తానికి 4 శాతం క్షీణించింది. గడిచిన 26 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. ముఖ్యంగా తయారీ రంగం ఉత్పత్తి క్షీణించడం, గనుల రంగంలో వృద్ధి మందగించడం, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు కూడా నిస్తేజంగా ఉండటంతో ఐఐపీ బాగా క్షీణించింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించిన ఐఐపీ వివరాల ప్రకారం తయారీ రంగం వృద్ధిరేటు ఈ అక్టోబర్‌లో మైనస్‌ 5.6 శాతానికి దిగజారింది. నిరుడు ఇదే నెలలో 3.3 శాతం వృద్ధిని కనబర్చింది. ఇక గనుల రంగంలో వృద్ధి కేవలం 2.5 శాతానికి, విద్యుదుత్పత్తిలో 1.2 శాతం, ప్రైమరీ గూడ్స్‌-మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తులు 1 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌-అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 5.3 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధిలో 20.5 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.