For Money

Business News

రీటైల్‌ ఇన్వెస్టర్లందరికీ షేర్లు

దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌గా హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ రికార్డు సృష్టించింది. అయితే రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పొందడంలో ఘోరంగా విఫలమైంది. ఇతర కేటగిరికి చెందిన ఇన్వెస్టర్ల ద్వారా ఈ పబ్లిక్‌ ఆఫర్‌ సక్సెస్ అయింది. సాయంత్రం 5.30ల వరకు వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే ఈ ఇష్యూ 2.37 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. మార్కెట్‌ నుంచి రూ. 27,870 కోట్లు సమీకరించేందుకు కంపెనీ 9.98 కోట్ల షేర్లను ఆఫర్‌కు చేయగా, 23.63 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. రీటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఇష్యూలో 35 శాతం షేర్లే రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేయగా, అందులో సగం అంటే 50 శాతం షేర్లకే దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన దరఖాస్తు చేసుకున్న రీటైల్‌ ఇన్వెస్టర్లందరికీ షేర్లు అందనున్నాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల పుణ్యమా అని ఈ ఆఫర్‌ పరువు దక్కించుకుంది. ఈ కోటా 6.97 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. అలాగే నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల భాగం 60 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఉద్యోగుల కోటా 1.74 రెట్ల బిడ్లు కావడంతో మొత్తం ఇష్యూ రెండు రెట్లుకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ ప్రారంభానికి ముందే కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్లు సమీకరించింది. ఆఫర్‌ ధరలోని గరిష్ఠ స్థాయికి కంపెనీ వీరికి షేర్లను కేటాయించడం విశేషం. ప్రీమియం మరీ అధికంగా ఉండటం, తక్షణ లాభాల కోసం దరఖాస్తు చేయొద్దని అనలిస్టులు ముక్తకంఠంతో సలహా ఇవ్వడంతో… రీటైల్‌ ఇన్వెస్టర్లు ఈ ఆఫర్‌ పట్ల ఆసక్తి చూపలేదు.
షేర్ల లిస్టింగ్‌ 22న
హ్యుందాయ్‌ ఇండియా షేర్లు ఈనెల 22న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతాయి. రేపు షేర్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది. అయితే ఈ కంపెనీ షేర్లకు అసలు పరీక్ష వచ్చే నెల ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో సగం షేర్ల లాకిన్‌ పీరియడ్‌ వచ్చే నెల 17న ముగుస్తుంది. అంటే తేదీన దాదాపు మరో రెండు కోట్ల షేర్లపై లాకిన్‌ ముగుస్తుంది. అంటే అదనంగా రెండు కోట్లకుపైగా షేర్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. మిగిలిన సగం షేర్లపై లాకిన్‌ పీరియడ్‌ వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన ముగుస్తుంది. సో… నవంబర్‌ 17 తరవాత ఈ షేర్ల అసలు సత్తా బయటపడే అవకాశముంది.

Leave a Reply