For Money

Business News

హ్యుందాయ్‌ ఐపీఓ రేపే…కాని

దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ రేపు ప్రారంభం కానుంది. స్టాక్‌ మార్కెట్‌ నుంచి సుమారు రూ. 27,870 కోట్ల రూపాయలు సమీకరించేందుకు హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా రేపు ప్రైమరీ మార్కెట్‌లోకి వస్తోంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణి రూ. 1865 నుంచి రూ. 1960గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌ కింద ఇన్వెస్టర్లు ఏడు షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. షేర్‌ ముఖ విలువ రూ. 10. రీటైల్‌ ఇన్వెస్టర్లకు మొత్తం ఆఫర్‌లో 35శాతం షేర్లు మాత్రమే కేటాయిస్తారు. ఈ ఏడాది అంటే మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 69,829 కోట్ల టర్నోవర్‌పై రూ. 6,060 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది.
తాజా ఈక్విటీ లేదు
ఇపుడు కంపెనీలో వంద శాతం దక్షిణ కొరియాలోని మాతృ సంస్థకు ఉంది. సెబి నిబంధనల మేరకు ఈవాటాను 75 శాతానికి తగ్గించేందుకు ఈ ఆఫర్‌ చేస్తోంది హ్యుండాయ్‌. అంటే కొత్త షేర్ల జారీ ఉండదు. ఉన్న షేర్లను కొరియా కంపెనీ అమ్ముతోంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా వచ్చే సొమ్ము మొత్తం కొరియా కంపెనీ మాతృసంస్థకు వెళుతుంది. 1996లో ఏర్పడిన హ్యండాయ్‌ మోటార్స్‌ ఇండియా కంపెనీ ఇపుడు భారీ ఎత్తున విస్తరణ చేపట్టింది. అయితే ఈ కంపెనీ ఉన్న రంగంలోకి పోటీ తీవ్రంగా ఉంటోంది. పైగా ఆటో రంగంపైనే ఇపుడు పెద్దగా ఆసక్తి లేని సమయంలో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది ఈ కంపెనీ.
గ్రే మార్కెట్‌లో ఢమాల్‌…
గ్రే మార్కెట్‌లో అంటే అనధికార మార్కెట్‌లో 18 సెషన్స్‌ క్రితం ఈ ఆఫర్‌కు రూ. 500 ప్రీమియం దక్కేది. ఇపుడు అంటే పబ్లిక్‌ ఆఫర్‌కు ఒక రోజు ముందు ఈ ప్రీమియం కేవలం రూ.45లకు పడిపోయింది. చూస్తుంటే ఈ ఇష్యూ ఆఫర్‌ ధర వద్దే లిస్ట్‌ కావొచ్చిన చాలా మంది అనలిస్టులు అంటున్నారు. మరికొందరు ఆఫర్‌ ధరకు దిగువకు కూడా రావొచ్చని కూడా అంటున్నారు. ఇవాళ యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపు పూర్తవుతంది. ఈ ఆఫర్‌ కోసం ఇపుడు దరఖాస్తు చేయడం కన్నా లిస్టింగ్‌ రోజు వరకు వెయిట్‌ చేసి అపుడు కొనుగోలు చేయడం బెటర్‌ అని కొందరు అంటున్నారు. మరికొందరు యాంకర్‌ ఇన్వెస్టర్లకు విధించిన లాకిన్ పీరియడ్‌ పూర్తయ్యే వరకు ఈ ఆఫర్‌ జోలికి వెళ్ళకపోవడమే బెటర్‌ అని కూడా అంటున్నారు. అయితే సంప్రదాయ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలో ఈ కంపెనీ షేర్‌ తప్పక ఉండాల్సిందే. మంచి కంపెనీ. మంచి పనితీరు ఉన్న కంపెనీ. అయితే షేర్‌ వ్యాల్యుయేషన్‌ వద్దే సమస్య అంతా. కాబట్టి లాకిన్ పీరియడ్‌ పూర్తయిన తరవాత ఈ షేర్‌ను కొనుగోలు చేయడం బెటర్‌.

Leave a Reply