అంతర్జాతీయ నగరాలతోనే హైదరాబాద్ పోటీ
ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే పోటీ అన్నారు. హైటెక్ సిటీలో కేటీఆర్ ఇవాళ రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ష్యూరిఫై ల్యాబ్స్ టెక్నాలజీ, కొలియర్‌ల నూతన కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 2012-13లో 20 లక్షల చదరపు అడుగుల పైచీలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉందని, గత ఏడాది 110 లక్షల చదరపు అడుగుల లీజ్ స్పేస్‌కు చేరుకుందని తెలిపారు. దీన్నిబట్టి హైదరాబాద్ ఎంత వేగంగా, ఎంత బలంగా అభివృద్ధివైపు దూసుకుపోతున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడేళ్ల క్రితం అమీర్‌పేట్‌లో ష్యూరిఫై కేవలం ఒకరితో కార్యాలయాన్ని ఏర్పాటుచేయగా, నేడు 230కిపైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నట్లు కంపెనీ సీఈఓ డస్టిన్ చెప్పారననారు. ఐటీలోనే కాకుండా అనేక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఐటీతోపాటు జీవశాస్త్రాలు, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో ఎంతగానో పురోగతి సాధించినట్లు చెప్పారు. ఎక్కువమంది హైదరాబాద్‌కు పశ్చిమం వైపునే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, పశ్చిమం వైపునే కాకుండా ఇతర ప్రాంతాల వైపు కూడా ఎదుగుదలకు అవకాశాలున్నాయన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కాకుండా నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.