రివర్స్ గేర్‌లో హీరో మోటో పనితీరు
డిసెంబరు త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ రూ .686 కోట్ల స్టాండలోన్ నికర లాభం ఆర్జించింది. 2020లో ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ .1,084 కోట్లతో పోలిస్తే ఇది 36.7 శాతం తక్కువ. సెప్టెంబరు త్రైమాసిక లాభం రూ.794 కోట్ల లాభంతో పోల్చితే 13.6 శాతం తగ్గింది. 2020 త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం సైతం రూ. 9,776 కోట్ల నుంచి 19.4 శాతం క్షీణించి రూ .7.883 కోట్లకు తగ్గింది. ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చింది. దీంతో అమ్మకాలు పడ్డాయి. తాజా త్రైమాసికంలో 12.92 లక్షల వాహనాలను అమ్మినట్లు కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెని 18.45 లక్షల వాహనాలను అమ్మింది. అంటే అమ్మకాలు ఏకంగా 30 శాతం తగ్గాయన్నమాట. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాల్లో క్షీణత 10శాతమే. అయితే స్పేర్ పార్ట్స్ విభాగం బాగా రాణించింది. ఈ విభాగం ఆదాయం 15 శాతం పెరిగి రూ. 1186 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ .60 చొప్పున మధ్యంతర డివిడెండు ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీని ఫిబ్రవరి 22. మార్చి 12న డివిడెండ్ చెల్లిస్తారు.