మిడ్ క్యాప్స్ ముంచేశాయి…
నిఫ్టిని చూస్తుండేసరికి… మిడ్ క్యాప్స్ ముంచేశాయి. నిఫ్టి పావు శాతమో.. అర శాతమో పడుతుంటే… మిడ్ క్యాప్స్‌లో అనేక షేర్లు లోయర్ సీలింగ్‌లో క్లోజయ్యాయి. స్టీల్ అని అనకున్న గట్టి మిడ్ క్యాప్ షేర్లు కూడా ఐస్ ముక్కలా కరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళూ నిఫ్టికి కాస్త అండగా ఉన్నా బ్యాంక్ షేర్లు కూడా ఒక మోస్తరుగా నష్టపోయాయి. అదే స్థాయిలో నిఫ్టి కూడా. కాని అసలు దెబ్బ ఐటీ రంగం నుంచి వచ్చింది. ఐటీ షేర్ల సూచీ ఏకంగా మూడు శాతం తగ్గింది. నిఫ్టి ఇవాళ ఉదయం 24,978ని తాకింది… అంతర్జాతీయ మార్కెట్ల మూడ్ చూసి… నిఫ్టి 25000 ఈజీగా దాటేస్తుందని భావించినవారికి షాక్ ఇచ్చింది. కేవలం గంటలోపే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 24679ని తాకింది. దాదాపు 300 పాయింట్లు కోల్పోయిందన్నమాట. అక్కడి నుంచి కోలుకుని 2 గంటల ప్రాంతానికల్లా నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చినా… 2.30 నుంచే మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. చివరి నిమిషం వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో నిఫ్టి 112 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక సెన్సెక్స్ 73 పాయింట్ల నష్ఠంతో ముగిసింది. గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే… సెన్సెక్స్ కన్నా నిఫ్టి భారీగా నష్టపోతోంది. ఇవాళ కూడా సెన్సెక్స్ కేవలం 0.09 శాతం నష్టపోగా, నిఫ్టి 0.29 శాతం క్షీణించింది. ఇక షేర్ల విషయానికొస్తే.. మేనేజ్మెంట్ నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతో బజాజ్ ఆటో ఇవాళ నాలుగు శాతంపైగా లాభపడింది. ఫలితాలు బాగుండటంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5 శాతం పెరిగింది. నిఫ్టి గెయినర్స్‌లో ఇవి టాప్‌లో ఉన్నాయి. ఇక తరువాతి స్థానాల్లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో టాటా కన్జూమర్ టాప్‌లోఉంది. ఫలితాలు బాగా లేకపోవడంతో ఈ షేర్ ఏకంగా 7 శాతంపైగా క్షీణించింది. చెత్త ఫలితాల కారణంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 5 శాతం దాకా తగ్గింది. తరవాతి స్థానాల్లో బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.