For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పనితీరు ఓకే

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలను వెల్లడించింది. అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే త్రైమాసికంలో 2.2 శాతం పెరిగి రూ. 16,736 కోట్లకు చేరింది. గత ఏడాది అంటే 2023 డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం రూ. 16,373 కోట్లుగా నమోదైంది. అయితే మార్కెట్‌ అంచనాలను బ్యాంక్‌ అందుకోలేకపోయింది. డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ. 17,233 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇదే సమయంంలో నికర వడ్డీ ఆదాయం (NII) మాత్రం 7.7 శాతం పెరిగి రూ. 30,650 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ ఇవాళ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ టర్నోవర్‌ రూ. 28,470 కోట్లు. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ. 76,583 కోట్లు. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో బ్యాంక్ డిపాజిట్లు రూ. 24,52,800 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే డిపాజిట్లలో 15.9 శాతం వృద్ధిని బ్యాంక్‌ సాధించింది. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు రిటైల్ రుణాలు 10 శాతం పెరిగాయి. గత డిసెంబర్ నెలాఖరు నాటికి బ్యాంకు శాఖల సంఖ్య 9,143కు చేరింది. తమకు 21,049 ఏటీఎంలు ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది.