For Money

Business News

సరే… మా బోనస్‌ వెనక్కి ఇవ్వండి

ఐటీ రంగంలో బాగా రాణిస్తున్న కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్‌ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు వివాదాస్పదంగా మారింది. కంపెనీని నుంచి మానేస్తున్న ఉద్యోగులకు… తాము చెల్లించిన బోనస్‌ వెనక్కి ఇవ్వమని ఉద్యోగుల కోరుతోంది. గత నవంబర్‌లో ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్‌ పంపింది. 2021 సెప్టెంబర్‌ 1 నుంచి 2022 మార్చి 31వ తేదీలోగా ఎవరైనా ఉద్యోగం మానేస్తే… 2021 ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీ చెల్లించిన ఎంప్లాయీ పర్ఫామెన్స్‌ బోనస్‌ (EPB)ని వెనక్కి ఇవ్వమని అంటోంది. దీంతో మరోచోట మంచి ఆఫర్‌ వచ్చిన ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది బోనస్‌ డబ్బు వాడేశామని… ఇపుడు కట్టమంటే ఎలా అని నిలదీస్తున్నారు. అయితే కంపెనీ ససేమిరా అంటోంది. బోనస్‌ డబ్బు వెనక్కి ఇవ్వకపోతే ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్, రిలీవింగ్‌ డాక్యుమెంట్‌తో పాటు ఇతర సంబంధిత డాక్యుమెంట్లను ఇవ్వమని ఉద్యోగం మానేసిన వారితో అంటోంది. ఈ అంశాన్ని కొందరు ఉద్యోగులు యూనియన్‌ల దృష్టికి తీసుకెళ్ళారు. వారు కేంద్ర కార్మిక మంత్రి లేఖ రాశారు. అయితే ఫలితం కన్పించడం లేదు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేస్తోంది. తాము అంతర్జాతీయ పద్ధతులను అవలంబిస్తున్నామని… దీనికి సంబంధించి తప్పుడు సమాచారం బయట ప్రచారం చేస్తున్నారని అంది. అంతకుమించి వివరాలు చెప్పడం లేదు.