బీమా ప్రీమియం: రేపే నిర్ణయం
ఆరోగ్య బీమాతో పాటు రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఇప్పటికే విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని పలువురు కేంద్ర మంత్రులు కోరడంతో రేపు అంటే సోమవారం జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై చర్చ జరుగనుంది. ప్రస్తుతం వీటిపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలని చాలా వర్గాలు గట్టిగా కోరుతున్నాయి. కనీసం సీనియర్ సిటిజన్లయినా దీని నుంచి మినహాయించాలని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు పలు రాష్ట్రాలు వ్యతిరేకించినట్లు కొన్ని మీడియా సంస్థలు రాశాయి. దీంతో జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని బీమా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ద్వారా రూ. 8,262 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ద్వారా రూ. 1,484 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. అలాగే జీఎస్టీ హేతుబద్దీకరణపై కూడా రేపటి సమావేశంలో చర్చ జరుగనుంది. ఇక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై విధిస్తున్న జీఎస్టీపై పలు అభ్యంతరాలు రావడంతో దీనిపై నియమించిన కమిటీ రేపు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వనుంది. 2023 ఆగస్టులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.