జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు?
ఈ నెల 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ సెక్రటేరియట్ సలహా ఇచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఏటీఎఫ్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని పేర్కొంది. ఈ అంశంపై చర్చించి సిఫారసులు చేయమని సెక్రటేరియట్ కోరింది. అయితే ఈ మేరకు అధికారికంగా మాత్రం కౌన్సిల్‌కు లేఖ రాయలేదని తెలుస్తోంది. జూన్ 21వ తేదీన కేరళ హైకోర్టు ఇచ్చిన ఓ ఆదేశం దరిమిలా జీఎస్టీ కౌన్సిల్ ఈ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించి.. ఆరువారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సెక్రటేరియట్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.