రూ. 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అమ్ముతాం
నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్లను ప్రైవేట్ రంగానికి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఢిల్లీలో చెప్పారు. మొత్తం రూ.6 లక్షల కోట్ల నిధుల సేకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె రోడ్‌మ్యాప్ ప్రకటించారు. నిర్ధిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధుల సమీకరణను చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు సీతారామన్ ప్రకటించారు.
ప్రైవేటీకరించదలచిన ఆస్తుల వివరాలు…
- రోడ్లు…26,700 కి.మీ. నేషనల్ హైవేను ప్రైవేటీకరిస్తారు. దీనివల్ల రూ. 1.6 లక్షల కోట్లు వస్తాయని అంచనా.
- రైల్వే శాఖ: 400 స్టేషన్లు, 150 రైళ్ళు,రైల్వే ట్రాక్‌లు,వుడ్ షెడ్‌లను ప్రైవేటీకరిస్తారు. దీనివల్ల వచ్చే ఆదాయం రూ. 1.5 కోట్లు
- విద్యుత్ లైన్లు: 42,300 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను ప్రైవేటుపరం చేయడం ద్వారా రూ. 0.67 లక్షల కోట్లు వస్తాయని అంచనా.
- విద్యుత్ ఉత్పత్తి: ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎల్‌సీలకు చెందిన 5,000 మెగావాట్ల హైడ్రో, సోలార్ ప్లాంట్లను విక్రయిస్తారు. దీనివల్ల రూ. 0.32 లక్షల కోట్లు వస్తాయని అంచనా.
- నేషనల్ గ్యాస్ పైప్‌లైన్లు: గెయిల్‌కు చెందిన 8000 కి.మీ. గ్యాస్ పైప్లైన్లను ప్రైవేట్ రంగానికి ఇస్తారు. దీనివల్ల రూ. 0.24 లక్షల కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
- పీడీటీ పైప్‌లైన్: ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్లలో 4000 కి.మీ. పైప్‌లైన్లను ప్రైవేట్‌కు అప్పజెబుతారు. దీనివల్ల రూ. 0.22 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా.
- టెలికాం: భారత్‌నెట్ ఫైబర్స్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎంఎన్‌లకు చెందిన కొన్ని టవర్లను ప్రైవేట్ రంగానికి ఇవ్వడం వల్ల రూ. 0.39 లక్షల కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
- వేర్ హౌస్: ఈ రంగం నుంచి రూ. 0.29 లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలని ప్రతిపాదన.
- మైనింగ్ : 160 కోల్ మైనింగ్ ప్రాజెక్టులు, 761 మినరల్ బ్లాకుల ప్రైవేటీకరణతో రూ.0.32 లక్షల కోట్లు.
- ఎయిర్‌పోర్ట్‌లు: AAI ఆధ్వర్యంలోని 25 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ. దీనివల్ల రూ.0.21 లక్షల కోట్లు వస్తాయని అంచనా.
- రేవులు : 9 రేవులలో ఉన్న 31 ప్రాజెక్టుల విక్రయంతో రూ. 0.13 లక్షల కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
- స్టేడియాలు: దేశంలోని రెండు ప్రధాన స్టేడియాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ద్వారా రూ. 0.11 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.