For Money

Business News

ఇక మీరు గ్రీన్‌ ఎనర్జి కావాలని అడగొచ్చు

ఇక నుంచి వినియోగానికి మీరు డిస్కమ్‌ల నుంచి గ్రీన్‌ ఎనర్జి కొనుగోలు చేయొచ్చు. సాధారణ విద్యుత్ బదులు గ్రీన్‌ ఎనర్జి కోరితే.. నిర్ణీత ధరకు డిస్కమ్‌లు మీకు ఆ ఎనర్జీనే సరఫరా చేస్తాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ఓపెన్‌ యాక్సస్‌ రూల్స్‌ 2022ని మారుస్తూ.. కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. 2030కల్లా దేశంలో గ్రీన్‌ ఎనర్జి వినియోగం 500 గిగా వాట్స్‌కు పెంచాలన్న ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో డిస్కమ్‌ నుంచి మీరు గ్రీన్‌ ఎనర్జి కావాలంటే కనీసం ఒక మెగావాట్‌ కోసం దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇక నుంచి మీరు వంద కిలో వాట్లను కూడా కొనుగోలు చేయొచ్చు. దీంతో ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా రెన్యూవబుల్‌ కనర్జి తక్కువ పరిమాణంలో కూడా కొనుగోలు చేయొచ్చు.
ఓపెన్‌ యాక్సెక్‌ కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో డిస్కమ్‌లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానం రాకపోతే మీ దరఖాస్తును అంగీకరించినట్లు ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రాష్ట్ర విద్యుత్‌ కమిషన్‌ గ్రీన్‌ ఎనర్జి ధరను నిర్ణయిస్తుంది. రెన్యూవబుల్‌ ఎనర్జి సగటు కొనుగోలు ధర, ఉంటే క్రాస్‌ సబ్సిడీ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు కలిసి గ్రీన్‌ ఎనర్జి ధరను నిర్ణయిస్తారు. అలాగే ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు,వీలింగ్‌ చార్జీలు, క్రాస్‌ సబ్సిడీ సర్‌ చార్జీలు, స్టాండ్‌బై చార్జీలు కూడా గ్రీన్‌ చార్జీలో ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర డిస్కమ్‌లు వెల్లడిస్తాయి.