TMB పబ్లిక్ ఆఫర్‌కు విశేష ఆదరణ
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కంపెనీ 1.58 కోట్ల షేర్లను రూ. 500- రూ. 525 ధర శ్రేణిలో షేర్లను ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రీటైల్ విభాగం కింద కేవలం పది శాతం షేర్లనే అంటే 87,12,000 షేర్లను ఆఫర్ చేస్తోంది. నిన్న ఆరంభం రోజే 72,56,228 షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. వందేళ్ళ చరిత్ర ఉన్న బ్యాంకు కావడం, పటిష్టమైన బ్రాంచ్ వ్యవస్థ ఉండటంతో ఈ పబ్లిక్ ఆఫర్‌కు అన్నీ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇదే స్థాయి బ్యాంకుల షేర్లు భారీ ప్రీమియంతో ట్రేడవుతుండటంతో చాలా మంది బ్రోకర్లు ఈ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేయమని రెకమెండ్ చేస్తున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 363 కోట్లను ఇప్పటికే బ్యాంక్ సమీకరించింది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా బ్యాంక్ రూ. 831.6 కోట్లను సమీకరించనుంది. మొత్తం పబ్లిక్ ఆఫర్ కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరిస్తున్నారు. ఇతర పబ్లిక్ ఆఫర్లలో చాలా వరకు ప్రమోటర్లు, ప్రైవేట్ ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంకు అమ్ముకుంటారు. ఈ ఇష్యూలో మొత్తం కొత్త షేర్లే. దీంతో డిమాండ్ భారీగా ఉంది. ఈ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. లిస్టింగ్‌లో కూడా ఈ షేర్‌కు మంచి ప్రీమియం లభించే అవకాశముంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ పబ్లిక్ ఆఫర్ చేయడం మంచిది. కనీసం 28 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు మొత్తం రూ. 14,700. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 364 షేర్లకు దరఖాస్తు చేయవచ్చు.