For Money

Business News

గోల్డ్‌ ర్యాలీ అపుడే అయిపోలేదు

బులియన్‌ మార్కెట్‌లో ముఖ్యంగా బంగారం ర్యాలీ ఇంకా ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ వెల్లడించింది. బులియన్‌ మార్కెట్‌పై ఆ సంస్థ ఇవాళ ఒక నివేదిక విడుదల చేసింది. స్టాండర్డ్‌ బంగారం ఔన్స్‌ ధర ఇపుడు అమెరికా మార్కెట్‌లో 2,628 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాస్త అటు ఇటూ ఊగిసలాట ఉన్నా ఈ ఏడాది చివరినాటికి బంగారం ధర 2800 డాలర్లకు చేరుకుంటుందని యూబీఎస్‌ అంచనా వేసింది. 2025లో మరింత పెరిగి ఔన్స్‌ బంగారం ధర 3000 డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. బంగారం మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి లేకపోవడం, డిమాండ్‌ మరింత పెరుగుతూ ఉండటమే ర్యాలీకి కారణమని తెలిపింది. అమెరికాతో పలు ప్రధాన దేశాల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయని.. అంటే అధిక ద్రవ్య సరఫరా ఉంటుందని… దీంతో బంగారం మరింత డిమాండ్‌కు ఆస్కారం ఉంటుందని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. అలాగే డాలర్‌ మరింత క్షీణిస్తుందనే అంచనాలు ఉన్నాయని.. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడుతుందని తెలిపింది. మున్ముందు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా మరింతగా బంగారాన్ని కొంటాయని… డిమాండ్‌కు తగ్గ సరఫరా లేనందున ధరలు మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. అయితే ధరలు పెరిగే కొద్దీ డిమాండ్‌ తగ్గుముఖం పడే అవకాశముందని పేర్కొంది. అయితే భారత్‌, చైనా వంటి మార్కెట్లలో ధరలు పెరిగినా డిమాండ్‌ మాత్రం నిలకడగా కొనసాగే అవకాశముందని యూబీఎస్‌ అంచనా వేస్తోంది.