For Money

Business News

తులం బంగారం రూ. లక్ష!

వచ్చే ఏడాదిలో ఔన్స్‌ బంగారం ధర 4000 డాలర్లకు చేరనుందని
సీఎన్‌బీసీ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విస్‌ ఏసియా కాపిటల్‌ చీఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ) జురేగ్‌ కీనర్‌ చెప్పారు. ప్రస్తుతం 1806 డాలర్లు ఉంటోంది. అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ అంటే 28.346 గ్రాములు. మన మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం పది గ్రాముల ధర రూ. రూ.55,000 ప్రాంతంలో ఉంది. బంగారం ధర రెట్టింపు కన్నా అధికమని విశ్లేషుకులు అంచనా వస్తున్న నేపథ్యంలో మన మార్కెట్‌లో తులం బంగారం రూ. లక్షను దాటే అవకాశముందన్నమాట.
అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక మాంద్యం ఇప్పటికే వచ్చేసిందని… వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మాంద్యం ఛాయలు కన్పిస్తాయని కేనర్‌ అంటున్నారు. అదే జరిగితే ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు సెంట్రల్‌ బ్యాంకులు మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గించక తప్పదని ఆయన అంటున్నారు. అయితే ఈసారి బంగారం పది లేదా 20 శాతం చొప్పున పెరగదని…చాలా ఫాస్ట్‌గా పెరుగుతుందని కేనర్‌ అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్ళను బాగా పెంచాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. 2018లో 241 టన్నుల బంగారం కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 400 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇందులో చైనా 120 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం చైనా ఫారెక్స్‌ నిల్వల్లో బంగారం నిల్వల విలువ 11,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.27 లక్షల కోట్లు) చేరింది. అలాగే ఇతర దేశాల కేంద్రబ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2000 పడిలో చూస్తే బంగారం నుంచి అందిన ప్రతిఫలం సగటున 8 శాతం నుంచి 10 శాతం ఉందని కీనర్‌ అంటున్నారు. ఎంతో గొప్పగా చెప్పుకునే బాండ్‌, ఈక్విటీ మార్కెట్లలో ఈ స్థాయి ప్రతిఫలాలు అందలేదని… ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు విస్మరించరాదని కీనర్‌ అన్నారు. అయితే కొంతమంది అనలిస్టులు కీనర్‌ వాదనను తోసిపుచ్చుతున్నారు. 4000 డాలర్లకు చేరితే సంతోషమేనని, కాని 1900 డాలర్లను మించకపోవచ్చని స్టేట్‌స్టోన్‌ వెల్త్‌కు చెందిన సీనియర్‌ మార్కెట్‌ వ్యూహకర్త కెనీ పాలకరి అంటున్నారు. 1900 డాలర్ల వద్ద బంగారానికి తీవ్ర ప్రతిఘటన ఉందని… అక్కడి నుంచి ధర మళ్ళీ తగ్గే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను బట్టి బంగారం ధరలు ఆధారూపడి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.