For Money

Business News

IPO: గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్స్‌ : దరఖాస్తు చేయొచ్చా?

పదేళ్ళ క్రితం మాతృసంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మస్యూటికల్స్‌తన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడెంట్స్‌ (API) వ్యాపారాన్ని విడగొట్టి గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సస్‌ను ఏర్పాటు చేసింది. ఇది కాంప్లెక్స్‌ ఏపీఐలతోపాటు బహుజాతి కంపెనీలకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో మందులు తయారు చేసి ఇస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలో ఈ కంపెనీకి నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ తన ఏపీఐలను జపాన్‌, ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా, యూరప్‌ కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ టర్నోవర్‌లో 91 శాతం జెనెరిక్‌, కాంప్లెక్స్‌ ఏపీఐల ద్వారా వస్తుంది. మరో 8 శాతం కాంట్రాక్ట్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ ద్వారా వస్తుంది. ఇతర వ్యాపారాల ద్వారా వచ్చే రెవెన్యూ ఒక శాతం కన్నా తక్కువ. 2020 ఈ కంపెనీ తన టర్నోవర్‌ను పెంచుకుంటున్నా.. కరోనా కారణంగా ఇటీవల కాస్త జోరు తగ్గింది. 2018-19లో రూ. 886 కోట్ల టర్నోవర్‌పై రూ. 196 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019-20లో రూ. 1537 కోట్ల టర్నోవర్‌పై రూ. 313 కోట్ల నికర లాభం, 2020-2021లో రూ. 1885 కోట్ల టర్నోవర్‌పై రూ. 352 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. గత మూడేళ్ళ పనితీరు చూస్తే రెండో ఏడాది 73 శాతం పెరిగిన టర్నోవర్‌, మూడో ఏడాది 23 శాతానికి పరిమితమైంది. అలాగే నికర లాభం వృద్ధి 22 శాతం, 20 శాతం, 19 శాతంగా తేలింది. అంటే మార్జిన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనికి కరోనా పరిస్థితులను కంపెనీ అంటోంది. కరోనా తరవాత కంపెనీ మార్జిన్లు పెరిగే ఛాన్స్‌ ఉంది.

స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు ఫార్మా రంగానికి సమీప భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేయమని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ షేర్‌ గ్రే మార్కెట్‌ (అనధికార మార్కెట్‌)లో రూ. 200 ప్రీమియం లభిస్తోంది. అంటే 25 శాతంపైగా లిస్టింగ్‌ రోజున లాభాలు అందే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌ పాజిటివ్‌గా ఉంటే లిస్టింగ్‌ రోజున రూ. 1000లకు చేరే అవకాశముందని కూడా స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్లు అంటున్నారు.
పబ్లిక్‌ ఆఫర్‌ విశేషాలు
ఇపుడు ఈ కంపెనీలో 100 శాతం వాటా మాతృత సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు ఉంది. ఇష్యూ తరవాత 82.84 శాతానికి తగ్గుతుంది. ఇపుడు పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.1,060 కోట్ల మేరకు కొత్త ఈక్విటీ జారీ ద్వారా సమీకరిస్తారు. ప్రమోటర్‌ కంపెనీ కూడా 63 లక్షల షేర్లను విక్రయిస్తుంది. మొత్తం ఆఫర్‌లో 35 శాతం మాత్రమే రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేస్తారు. ఆఫర్‌ ఈనెల 27న ప్రారంభమై… 29న ముగుస్తుంది. రూ. 2 ముఖవిలువ కలిగిన ఈ షేర్‌ ఆఫర్‌ కనిష్ఠ ధర రూ.695 కాగా, గరిష్ఠ ధర రూ. 720. ఒక లాట్‌లో 20 షేర్లు ఉంటాయి. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అంటే గరిష్ఠ ధర వద్ద మీరు దరఖాస్తు చేయాలంటే రూ. 14,400 చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 13 లాట్ల వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. షేర్ల అలాట్‌మెంట్‌ ఆగస్టు 3లోగా పూర్తవుతుంది. ఆగస్టు 6వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్లు లిస్ట్‌ అవుతాయని భావిస్తున్నారు. అంటే 5వ తేదీ కల్లా అలాట్‌ అయినవారి డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు క్రెడిట్‌ చేస్తారు.