గ్లాండ్‌ఫార్మా లాభంలో క్షీణత
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.241.24 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.302.80 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఈసారి 20 శాతం తగ్గింది. కంపెనీ టర్నోవర్ మాత్రం రూ.1,080.47 కోట్ల నుంచి రూ.1,044.4 కోట్లకు స్వల్పంగా పడిపోయింది. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాలు క్షీణించినట్లు కంపెనీ పేర్కొంది. తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ పెరిగిందని, అయితే కొత్త ఉత్పత్తుల ద్వారా ఈ పోటీని తట్టుకుంటామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీనివాస్ సాధు తెలిపారు. అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రావాల్సిన రాబడిలో మూడు శాతం పెరిగి రూ.747.50 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు.