ముకేష్ అంబానీ కోలుకోవడం కష్టమేనా?
కేవలం కొన్ని రంగాలకు పరిమితం కావడం ఇపుడు రిలయన్స్ గ్రూప్ ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారింది. ముఖ్యంగా లైసెన్స్‌లో దశ తిరిగే రంగాల్లో అదానీ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. కేంద్రం నుంచి అందుతున్న సాయంతో ట్రాన్స్మిషన్, రోడ్లు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు ఎయిర్‌పోర్టుల రంగంలోకి విస్తరించింది. ఇక గ్రీన్ ఎనర్జీ కంపెనీ సంగతి సరేసరి. పైగా అన్ని కంపెనీల్లో మెజారిటీ వాటా తన వద్దే ఉంచుకుని… ఆయా కంపెనీల షేర్లకు మద్దతు ఇవ్వడంతో అదానీ విల్మర్ వంటి కంపెనీల షేర్ల ధరలు కొన్ని నెలల్లోనే డబుల్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్న అదానీ షేర్లు అప్పర్ సీలింగ్‌లో ట్రేడవుతున్నాయి. దీని ఫలితమే ముకేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ నుంచి వైదొలగారు. మరోవైపు అదానీ ఆరోస్థానానికి చేరి… టాప్ ఫైవ్‌లో స్థానం సంపాదించడానికి పరుగులు పెడుతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియన్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్ ప్రకారం… 11,800 కోట్ల డాలర్ల (రూ.8.97 లక్షల కోట్లు) సంపదతో అదానీ ఆరోస్థానంలో ఉన్నారు. 9500 కోట్ల డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. నిన్న స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించినా… అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 857 కోట్ల డాలర్లు (రూ.65,000 కోట్ల పైమాటే) పెరిగింది. టాప్ టెన్ జాబితాలో గూగుల్ వ్యవస్థాపకులైన ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ సైతం దాటేశారు. ఈ ఏడాదిలో అత్యధిక సంపద వృద్ధిని చేసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఆయనదే అగ్రస్థానం. 2022లో ఇప్పటివరకు అదానీ ఆస్తి దాదాపు 4,160 కోట్ల డాలర్లు (రూ.3.16 లక్షల కోట్లు) పెరిగింది.