ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల విభాగం, పెట్టుబడులు- ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) మధ్య గత కొన్ని వారాలుగా చర్చ నడుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తరవాత అంతర్ మంత్రిత్వ శాఖల మధ్య చర్చ జరిగాక, కేబినెట్ ఆమోదానికి ఈ ప్రతిపాదనను పంపుతారు. ఎల్ఐసీలో ఎక్కువ వాటాను ఒకటే విదేశీ కంపెనీ కొనుగోలు చేసేలా వీలు కల్పించాలన్నది ప్రతిపాదన. అయితే ఎల్ఐసీలో ఎంత ఎఫ్‌డీఐకి అనుమతించాలనే అంశంపై ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డీఐ అనుమతించాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సాధారణ బీమా రంగంలో 74% వరకు ఎఫ్‌డీఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్ఐసీకి వర్తించదు.