సెబీ నిర్ణయంతో రైతులు గగ్గోలు

ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి తీసుకున్న నిర్ణయాన్ని ఇటు వ్యాపారస్థులు, అటు రైతులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోయాబీన్, దాని ఉత్పత్తులు, ఆవాలు, దాని ఉత్పత్తులు, వరి (బాస్మతి కానివి), గోధుమలు, పెసర పప్పు, శనగలు,ముడి పామాయిల్‌లో ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను మరో ఏడాది పొడిగిస్తూ సెబి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల హోల్‌సేల్ మోసాలు మరింత పెరుగుతాయని రైతులు అంటున్నారు. ఫార్వర్డ్ ట్రేడింగ్ ఉండటం వల్ల ఒక్కో ఉత్పత్తి ధర ఇపుడు ఎలా ఉందో తెలుసుకోవడంతో పాటు మున్ముందు ఎలా ఉండబోతోందో కూడా రైతులకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఫార్వర్డ్ ట్రేడింగ్ మూడు నెలల వరకు ఉంటుంది. అంటే మూడు నెలల తరవాత తమ ఉత్పత్తికి ఉజ్జాయింపుగా ధర ఎంత ఉంటుందో ముందే రైతులకు తెలుస్తోంది. ఇపుడు ఫార్వర్డ్ ట్రేడింగ్ ఎత్తేయడంతో బ్రోకర్లు చెప్పిన ధరకే కాంట్రాక్ట్‌లు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వాణిజ్య పంటలు వేసిన కొన్ని నెలలు, రోజులకే బ్రోకర్లతో రైతులు ఒప్పందం చేసుకుంటారు. ఫార్వర్డ్ ట్రేడింగ్ వల్ల మూడు నెలల తరవాత తన పంటకు ఎంత ధర వస్తుందో ఐడియా వచ్చేది. ఇపుడు దాన్ని రద్దు చేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు.