తెలంగాణ ఎన్నికలు: కర్ణాటక టార్గెట్
తెలంగాణ ఎన్నికల్లో ఏపీ, కర్ణాటక అంశాలు కీలకంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు పదే పదే తమ అభివృద్ధి చెప్పుకోవడం కోసం ఏపీ వినాశనాన్ని పేర్కొంటూనే… కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదనే ప్రచారం మొదలు పెట్టారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నేరుగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ… బీఆర్ఎస్ ప్రచారం అబద్ధాల పుట్ట అని ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో సరిహద్దు నియోజకవర్గాల్లో కర్ణాటక రైతులమని కొందరు రైతులు చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 300 ఇవ్వడంతో తాము తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మీడియా ముందు అంగీకరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం నాటి నుంచి కర్ణాటకలో విద్యుత్ సరఫరా లేదనే ప్రచారం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఈ సమయంలో మొసలి వీడియో బాగా వైరల్ అయింది. అయినా… కాంగ్రెస్ దూకుడు తగ్గకపోవడంతో ఇపుడు కొత్త ప్రచారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కంపెనీలపై కర్ణాటక ప్రభుత్వం కన్నేసిందనే ప్రచారం ప్రారంభించారు. దీనికి గాను కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఫాక్స్‌కాన్‌కు లేఖ రాశారంటూ ఓ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మద్యం స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన ముత్తా గోపాల కృష్ణకు చెందిన ఆంధ్రప్రభ పత్రిక దీన్ని పతాక శీర్షికలో ప్రచురించింది. ఆ కథానాన్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ మంత్రలు సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేశారు. ఇదంతా బీజేపీ సోషల్ మీడియా సాయంతో చేస్తున్న ప్రచారం అని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా ఈ తప్పుడు లేఖను ప్రస్తావించడంతో డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. సదరు తప్పుడు లేఖకు సంబంధించి తాము ఫిర్యాదు చేశామని… ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన ట్వీట్ చేయడంతో… ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇపుడు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగనున్నారు. రాజకీయ ఆరోపణలు కాస్త ఇపుడు క్రిమినల్ కేసులకు దారి తీస్తున్నాయి. మరి ఈ ఇలాంటి ప్రచారాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఎందుకంటే రాష్ట్రాల ఆర్థిక అంశాలను, కార్పొరేట్ ఇమేజ్‌లను ప్రభావితం చేసే ఇలాంటి అంశాలు రాజకీయాలకు వేదిక కావడంపై పారిశ్రామిక వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.