For Money

Business News

ఐటీ కొత్త స్కీమ్‌ ఉపసంహరణ?

పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విధానంలో కొత్త మార్పు కోసం కేంద్రం ప్రయత్నించింది. తక్కువ పన్ను రేటుకు వీలు కల్పిస్తూ… మినహాయింపులు లేని కొత్త పన్ను స్కీమ్‌ను 2020-21లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. పాత పద్ధతిలో వివిధ రకాల సెక్షన్ల కింద వివిధ రంగాలు/స్కీముల్లో పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపు ఉండేది. అంటే పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే నిర్ణీత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. ఈ గొడవ లేకుండా నిర్ణీత శాతం పన్ను కడితే చాలు… ఏ స్కీమ్‌లోనూ పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదని కేంద్రం ప్రతిపాదించింది. అయితే పాత విధానం కూడా అమల్లో ఉంటుందని… ఇష్టమైన వారు పాత పద్ధతిలోనే కొనసాగవచ్చని పేర్కొంది. మెజారిటీ పన్ను చెల్లింపు దారులు పాత పద్ధతివైపే మొగ్గు చూపారు. దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతిని ఉపసంహరించుకోవాలని కేంద్ర యోచిస్తోంది. దీనికి బదులు పాత పద్ధతిలోనే మరికొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. తక్కువ ట్యాక్స్‌ కట్టేవారికి అనుకూలంగా ఉండేలా స్లాబుల్లో మార్పు తెచ్చే అవకాశముంది. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షలు దాటితే నిర్ణీత పన్ను చెల్లించాల్సిఉంది. అదే పాత పద్ధతిలో కొనసాగేవారు రూ.5 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పనిలేదు. దీంతో చాలా మంది పాత పద్ధతికే మొగ్గు చూపారు. మొత్తం ట్యాక్స్‌ పేయర్స్‌లో రూ.5 లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారి శాతం 75 శాతం ఉంది. కొత్త పద్ధతిని ఎంచుకున్నవారి సంఖ్య ఒక శాతం కూడా లేకపోవడంతో… దీన్ని ఉపసంహరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కొత్త బడ్జెట్‌ తయారీ కసరత్తు నడుస్తోంది. మున్ముందు ఈ మార్పులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.