అద్భుత లాభం: 10 శాతం పతనం
ఇవాళ స్టాక్ మార్కెట్లో దివీస్ ల్యాబ్ షేర్ల పతనం గురించి చర్చించని ఇన్వెస్టర్ లేడు. గత ఏడాదితో పోలిస్తే ఇతర ఫార్మా కంపెనీ ఇవ్వని విధంగా అద్భుత ఫలితాలను కంపెనీ ప్రకటించింది. 78 శాతం నికర లాభం పెరిగింది. షేర్ ఇవాళ్టి గరిష్ఠ స్థాయి రూ. 4438కి చేరింది. వారం రోజుల నుంచి దివీస్ ల్యాబ్ ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఎందుకంటి ప్రధాన మ్యూచువల్ పండ్ల వద్ద ఈ షేర్లు ఉన్నాయి. అలాగే దీర్ఘకాలిక, మధ్య కాలిక ఇన్వెస్టర్ల వద్ద కూడా. గత డిసెంబర్ నెలలో సూపర్ ఫలితాలు అందించిన దివీస్ ల్యాబ్ ఈసారి కూడా అంతకుమించి ఫలితాలను ఇచ్చింది. కంపెనీ నికర లాభం రూ. 650 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ అంచనా వేసింది.అయితే కంపెనీ రూ.1000 కోట్ల నికర లాభం ప్రకటించింది. షేర్ రూ. 4438 వద్ద ఉండగా… కంపెనీ అనలిస్టులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లోని కొన్ని అంశాలు విన్న తరవాత అనలిస్టులు ఈ షేర్‌కు సెల్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ షేర్ పది శాతం వరకు నష్టపోయింది. ఒకదశలో రూ.3874కు క్షీణించింది. అంటే ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే రూ. 550లు క్షీణించిందన్నమాట. ఇంతగా పడటానికి ప్రధాన కారణాలు… కంపెనీ భవిష్యత్ అంచనాలు ఇవ్వడానికి నిరాకరించడం. గైడెన్స్ గురించి అనలిస్టులు కంపెనీ యాజమాన్యాన్ని అడగ్గా.. గైడెన్స్ ఇవ్వడం లేదని చెప్పారు. అనిశ్చితి అధికంగా ఇవ్వలేమని…అయినా.. కంపెనీ పనితీరు బాగా ఉంటుందని యాజమాన్యం చెప్పింది. కంపెనీకి రావాల్సిన బకాయిల మొత్తం బాగా పెరిగినట్లు అనలిస్టులు చెబుతున్నారు. చివరిది ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వద్ద నిర్మించ తలపెట్టిన ప్లాంట్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి గడువు ఇవ్వకపోవడం. కాకినాడ ప్లాంట్‌ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు హయాంలో కేంద్రం, రాష్ట్రం అనుమతులు ఇచ్చినా.. జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ప్లాంట్ నిర్మాణం పెండింగ్‌లో పడింది. వీటన్నింటి కారణంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మినట్లు వదంతులు ఉన్నాయి.