రూ.2000లోపు లావాదేవీలపై జీఎస్టీ…వాయిదా
ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించే నగదు రూ. 2000లోపు ఉన్నా… వాటిపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదన వాయిదా పడింది. ఈ అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీ పరిశీలనకు పంపాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. అలాగే యూనివర్సిటీలకు అందే గ్రాంట్లపై జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనకు నో చెబుతూ… వాటిని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో ఏడు యూనివర్సిటీలకు రూ.220 కోట్ల నోటీసులను డీజీజీఐ పంపిన విషయం తెలిసిందే. ఇక ఛార్టెడ్ హెలికాప్టర్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అయితే తీర్థయాత్రలకు, టూరిస్టుల కోసం వాడే హెలికాప్టర్ సర్వీసులకు మాత్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. అలాగే ఆరోగ్య బీమా,జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేయాలనే అంశంపై చాలా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, అయితే ఈ అంశాన్ని జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ మంత్రుల కమిటీ పరిశీలకు పంపారు. వచ్చే సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈలోగా ఈ అంశానికి సంబంధించి మరింత డేటాను విశ్లేషిస్తారని మంత్రి అన్నారు.