ప్చ్… సులా వైన్యార్డ్ లిస్టింగ్
సులా వైన్యార్డ్స్ కంపెనీ లిస్టింగ్ ఇన్వెస్టర్లకు నిరాశపర్చింది. సరిగ్గా దరఖాస్తు చేసిన ధర వద్దే ఈ షేర్ లిస్టయినా క్షణాల్లో నష్టాల్లోకి జారింది. ఎన్ఎస్ఈలో ఈ షేర్ రూ. 361 వద్ద లిస్టయిన… వెంటనే రూ.346ని తాకింది. అంటే రూ. 11 నష్టంతో ట్రేడవుతోంది. ఈ నెల 12న ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ.960 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే. ఒక్కో షేర్‌ను రూ. 357 ఆఫర్ చేశారు. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు కలిపి మొత్తం 2.7 కోట్ల షేర్లను అమ్మారు. ఇష్యూ సమయంలో గ్రే మార్కెట్లో ఈ షేర్ రూ. 47 ప్రీమియం ఉన్నా.. తరవాత లిస్టింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఈ ప్రీమియం కరిగిపోయింది. ఇపుడు మార్కెట్లో ఉన్న ఇతర వైన్ కంపెనీల వ్యాల్యూయేషన్‌కు సమానంగా ఈ కంపెనీ వ్యాల్యూయేషన్ చేశారని విశ్లేషకులు తెలిపారు. దీంతో ప్రధాన ఇన్వెస్టర్లు ఈ ఇష్యూకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఈ ఇష్యూ కేవలం 2.5 రెట్లు మాత్రమే ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మున్ముందు ఈ షేర్‌కు ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.