రెడ్డీస్ లాభం 76 శాతం డౌన్
కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా తగ్గతింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదేకాలంలో ఈ లాభం రూ. 362.4 కోట్లు. తాజా త్రైమాసికంలో రూ. 510 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చని అనలిస్టులు అంచనా వేశారు. మార్చి త్రైమాసికంలో ఆదాయం 15 శాతం వృద్ధిచెంది రూ. 5,437 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా, యూరప్‌లలో ధరల ఒత్తిడి, ఎగుమతి ప్రయోజనాలు తగ్గడం, ఇన్వెంటరీలు పెరగడం, ఇంపైర్మెంట్ చార్జీలు పెరగడం తదితర కారణాలతో చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం తగ్గిందని కంపెనీ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ గురువారం తెలిపారు. టెపిలమైడ్ ఫుమరేట్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ల మార్కెట్ అవకాశాలు తగ్గినందున రూ.430 కోట్లు, అమెరికాలోని ష్రెవెపోర్ట్ ప్లాంట్ ఆస్తులు, గుడ్‌విల్‌కు రూ.310 కోట్లు.. మొత్తం రూ. 760 కోట్ల ఇంపైర్మెంట్ ఛార్జీలను కంపెనీ ఖాతాల్లో చూపించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల నికరలాభం ఆర్జించింది.
బూస్టర్‌గా స్పుత్నిక్ లైట్ఏ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నప్పటికీ.. బూస్టర్ డోస్‌గా (యూనివర్సల్ బూస్టర్) సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్‌కు డీసీజీఐ నుంచి అనుమతి పొందడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది. జూన్ చివరకు లేదా జూలైలో మొదట్లో యూనివర్సల్ బూస్టర్‌గా అనుమతి పొందడానికి దరఖాస్తు చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (ఏపీఐ, సర్వీసెస్) దీపక్ సప్రా తెలిపారు.