Crypto Currency: క్రిప్టో బిల్లు ఎప్పుడంటే..?
క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదం లభించగానే పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లోనే క్రిప్టో బిల్లు తీసుకురావాలనుకున్నప్పటికీ.. వివిధ వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. దీంతో ఆ సమావేశాల్లో బిల్లును తీసుకురాలేదన్నారు. వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో పాత బిల్లులోనే మార్పులు చేశామమని, సవరించిన బిల్లునే తాజాగా తీసుకొస్తున్నామని అన్నారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌కు సంబంధించి వివిధ సంస్థలు ఇస్తున్న ప్రకటనలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. అయితే, ‘అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ నిబంధనలను అనుసరించి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా ఆర్జించిన లాభాలపై మదుపర్లు ఆదాయ పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంపై తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి సమాధానం లేదని సీతారామన్ తెలిపారు.