ఏడేళ్ళ గరిష్ఠానికి క్రూడ్
డాలర్ కూడా ఏడాది గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో క్రూడ్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠానికి చేరడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ముఖ్యగా నేచురల్ గ్యాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. నేచురల్ గ్యాస్ ధరలు కూడా భారీగా పెరగడంతో చాలా మంది క్రూడ్ ఆయిల్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఊహించని ఈ పరిణామంతో క్రూడ్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా డాలర్ పెరిగితే… ఆ మేరకు క్రూడ్ ధరలు తగ్గాలి. కాని పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్‌తో కూడా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న కాస్త డల్‌గా ఉన్న డాలర్ ఇవాళ మళ్ళీ పుంజుకుంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ 94ను దాటే అవకాశం అధికంగా కన్పిస్తోంది. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ 81.56 డాలర్లను దాటింది. ఒపెక్ దేశాలు ఇపుడున్న పరిస్థితి కొనసాగించేందుకు నిర్ణయించాయి. అంటే సరఫరా పెంచరన్నమాట. నవంబర్ నెల మొదటివారం మళ్ళీ ఒపెక్ సమావేశం కానుంది. అప్పటి వరకు క్రూడ్ ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు.