For Money

Business News

ఈ ఐపీఓకు కూడా బంపర్‌ క్రేజ్‌!

ఇటీవల వచ్చిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఐపీఓ ఇన్వెస్టర్లకు బంపర్‌ లాభాలను ఇచ్చింది. లిస్టింగ్ రోజే 40 శాతం లాభం ఇచ్చిన ఈ షేర్‌ ఇపుడు దాదాపు రెట్టింపు ధర వద్ద ఉంది. ఫార్మా రంగం నుంచి ఇలాంటి ఐపీఓనే మార్కెట్‌లోకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన కాంకర్డ్‌ బయోటెక్‌ కంపెనీ ఐపీఓ వస్తోంది. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి దాదాపు 24 శాతంపైగా వాటా ఉన్న ఈ కంపెనీ ఐపీఓకు మార్కెట్‌లో భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఈ కంపెనీలో దాదాపు 98 శాతం ఈక్విటీ కేవలం 11 మంది ఇన్వెస్టర్ల దగ్గర ఉంది. ఇందులో 20 శాతం వాటా ఉన్న హెలిక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ కంపెనీ తన వాటాను ఐపీఓ ద్వారా అమ్మేయనుంది. ప్రమోటర్లతో సహా మిగిలిన ఇన్వెస్టర్లు మాత్రం తమ వాటాను కొనసాగించనున్నారు. అంటే ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా 80 శాతం దాకా వాటా కేవలం పది మంది ఇన్వెస్టర్ల వద్ద ఉంటుంది. ప్రమోటర్‌ గ్రూప్‌కు 44 శాతం వాటా ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ కింద 2.09 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు. రూపాయి ముఖ విలువ కలిగిన ఈ కంపనీ షేర్‌ ఆఫర్‌ ధర శ్రేణి రూ. 705 నుంచి రూ. 741 వరకు. గరిష్ఠ ధరకు షేర్లను కేటాయించినా.. ఈ ఆఫర్‌ ద్వారా హెలిక్స్‌కు రూ. 1551 కోట్లు లభించనున్నాయి. ఆఫర్‌లో దాదాపు 50 శాతం క్యూఐపీ ఇన్వెస్టర్లకు, 15 శాతం హెచ్‌ఎన్‌ఐలకు కేటాయిస్తారు. మిగిలిన 35 శాతం వాటాను రీటైల్‌ ఇన్వెస్టర్లకు అలాట్‌ చేస్తారు. మొత్తం ఐపీఓ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నందున.. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత కంపెనీ ఈక్విటీ పెరగదు. ఏపీఐ రంగానికి చెందిన ఈ కంపెని పనితీరు చాలా బాగుంది. అయితే కంపెనీకి ఉన్న పాజిటివ్‌ అంశాలన్నింటి మేరకు ఆఫర్‌ ధర నిర్ణయించారని… దీర్ఘకాలానికైతే ఈ షేర్‌ మంచి ప్రతిఫలాలను ఇస్తుందని అనలిస్టులు అంటున్నారు. అయితే ఫార్మా రంగానికి ఇపుడు ఉన్న క్రేజ్‌. మ్యాన్‌కైండ్‌ ఫార్మా లాభాలతో పాటు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఫ్యామిలీకి వాటా ఉండటంతో.. లిస్టింగ్‌ లాభాలు కూడా బాగా ఉండొచ్చు. ఇటీవల రాకేష్‌ ఫ్యామిలీకి వాటా ఉన్న మెట్రో బ్రాండ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కూడా మంచి రిటర్న్‌ ఇచ్చింది. పబ్లిక్‌ ఆఫర్‌ రేటుకు రెట్టింపు ధర వద్ద మెట్రో బ్రాండ్స్‌ ఇపుడు ట్రేడవుతోంది. ఇపుడు గ్రే మార్కెట్‌లో ఈ షేర్‌కు రూ. 250 ప్రీమియం లభిస్తోంది. అంటే లిస్టింగ్‌ రోజున షేర్‌ ధర రూ. 1000 దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట.