పారదర్శకత కోసమే కంపెనీల చట్ట సవరణ…
కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో మరింత పారదర్శకత తీసుకు వచ్చేందుకే కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ రాజ్యసభకు తెలిపారు. వైకాపా సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కంపెనీలు ఏటా ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో క్రిప్టో కరెన్సీ, వర్చువల్ కరెన్సీ లావాదేవీలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యకలాపాల కింద ఆయా కంపెనీలు చేస్తున్న ఖర్చుల వివరాలను వెల్లడించేందుకు వీలుగా కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సవరణ ద్వారా ప్రతి కంపెనీ ఆ ఆర్థిక సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ ద్వారా నిర్వహించిన లావాదేవీలు, వాటిలో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో విధిగా వెల్లడించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం చేస్తున్న ఖర్చు, వాటి స్వభావం, సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం వెచ్చించే మొత్తంలో తరుగుదల వస్తే వాటి వివరాలు ఆయా కంపెనీలు తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో పొందుపరచాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.