For Money

Business News

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

ఇపుడు దేశంలో ధర పెరగని వస్తువు లేదు. కొన్నయితే.. ప్రతినెలా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, కూరగయాలు, వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరలు వంతులవారీగా పెరుగుతూనే ఉన్నాయి. కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. ప్రతి నెలా ఆరంభంలో ధరలను ఈ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో చిన్న చిన్న ఫుడ్‌ స్టాల్స్‌ కూడా ధరలు పెంచాయి. ఇవాళ కమర్షియల్‌ 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.104 చొప్పున ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయి.ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.102.5 పెరిగింది. మే 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ కొనాలంటే రూ.2355.5 వెచ్చించాల్సి ఉంటుంది. ముంబైలో రూ.2205కి బదులు రూ.2329.50 చెల్లించాలి. కోల్‌కతాలో రూ.2351కి బదులు 2477.50 ఖర్చు చేయాలి. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2406 నుంచి రూ.2508కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2563.5కి పెరిగింది. గతంలో దీని ధర రూ.2460 ఉండేది. ఇక ఏపీలో విశాఖపట్నంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2321 నుంచి రూ.2413కి పెరిగింది. విజయవాడలో ధర రూ.2420 నుంచి ప్రస్తుతం రూ.2501కి చేరింది. గత ఏప్రిల్ 1న ఈ గ్యాస్‌ సిలిండర్ ధర రూ.250 పెంచాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు.