For Money

Business News

11 ఏళ్ళలో రూ.1.29 లక్షల కోట్ల రుణాలు రద్దు

ఒక్క కెనరా బ్యాంక్‌ 11 ఏళ్ళలో రద్దు చేసిన రుణాల మొత్తం రూ. 1.29 లక్షల కోట్లు. పెద్ద పెద్ద కంపెనీలు డీఫాల్టర్లుగా మారగా… బ్యాంక్‌ ఈ మొత్తాలను రద్దు చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బ్యాంక్‌ ఈ వివరాలు వెల్లడించింది.అయితే రుణాలు ఎగవేసిన వ్యక్తుల పేర్లు మాత్రం బ్యాంక్‌ వెల్లడించలేదు. పుణెకు చెందిన సహ కార్యకర్త వివేక్‌ వెలంకర్‌ ఆర్టీఐ యాక్ట్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బ్యాంక్‌ ఈ వివరాలు పొందుపర్చింది. 2011-12లో రూ. 397 కోట్లు, 2012-13లో రూ. 980 కోట్లు, 2013-14లో రూ. 1433 కోట్లు, 2014-15లో రూ. 1748 కోట్లు, 2015-16లో రూ. 3372 కోట్లు 2016-17లో రూ. 5332 కోట్లు, 2017-18లో రూ. 9316 కోట్లు, 218-19లో రూ. 19,792 కోట్లు 2019-20లో రూ. 23051 కోట్లు, 2020-21లో (సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం తరవాత) రూ. 31,417 కోట్లు 2021-22లో రూ. 32,244 కోట్ల రుణాలను కెనరా బ్యాంక్‌ రద్దు చేసింది. ఇవన్నీ రూ.100 కోట్ల దాటిన రుణాలు. అంటే పెద్దవాళ్ళ రుణరద్దు (రుణమాఫీ?) అన్నమాట. అదే కోటి రూపాయలు అంతకు మించిన రుణాల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… మొత్తం రూ.1,30,812 కోట్లని పేర్కొంది. అంటే చిన్న రుణాలు తీసుకున్నవారికి పెద్దగా రుణ రద్దు లేదన్నమాట.
సాధారణంగా ఈ రుణాల రద్దు గురించి మాట్లాడితే అధికారంలో ఉన్న పార్టీ చెప్పే మాట ఒక్కటే. రుణాల రద్దు అంటే పూర్తిగా రద్దు చేయమని… రుణాల వసూలు ప్రక్రియ కొనసాగుతుందని.. రుణాలు తిరిగి వసూలు అయినపుడు బ్యాంకు ఖాతాల్లో చూపుతామని ఆర్థక శాఖ మంత్రి అంటారు. ఇక 2012-13 నుంచి 2019-20 మధ్య కాలంలో కెనరా బ్యాంక్‌ రూ. 47,310 కోట్ల రుణాలను రద్దు చేయగా… వసూలైన మొత్తం కేవలం రూ. 8,901 కోట్లు, అంటే రుణ రద్దు చేసిన మొత్తంలో కేవలం 19 శాతం అన్నమాట. సో… 81 శాతం రుణం శాశ్వతంగా రద్దయినట్లే.