బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు
బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (NARCL) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది. NARCL జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో NARCL జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్‌కు ప్రభుత్వ గ్యారంటీ లభించనుంది.
ప్రభుత్వ గ్యారెంటీ తొలి దశలో దాదాపు రూ.31,000 కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేస్తోంది.రూ.6,000 కోట్ల బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌కు ఐబీఏ గతవారం ఆర్బీఐని సంప్రదించింది. వచ్చే రెండు నెలల్లో ఈ లైసెన్స్ జారీ అవకాశం ఉంది. ఎన్ఏఆర్సీఎల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి.