2రోజుల్లో రూ. 15,000 తగ్గిన వెండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి అనేక మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సుంకాల సునామీకి స్టాక్ మార్కెట్‌తో పాటు మెటల్స్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గించేందుకు సుముఖంగా లేమని ఫెడరల్ బ్యాంక్ ఇవాళ స్పష్టం చేయడంతో బులియన్ మార్కెట్ బుడగలా పేలిపోయింది. నిన్న ప్రారంభమైన అమ్మకాలు ఇవాళ హోరెత్తాయి. ముఖ్యంగా పారిశ్రామికరంగంలో విరివిగా వాడే వెండి ధరలు ఐస్ ముక్కలా కరిగిపోతున్నాయి. భారత మార్కెట్లో కేవలం రెండు రోజుల్లో కిలో వెండి ధర 15 వేల రూపాయలకు పైగా క్షీణించింది. ఈ ఒక్క రోజే ఎంసీఎక్స్‌లో సిల్వర్ మే కాంట్రాక్ట్ ధర 8 వేల రూపాయలకు పైగా పడింది. నిన్న కాస్త స్థిరంగా ఉన్న బంగారం ఇవాళ భారీగా క్షీణించింది. పది గ్రామలు స్టాండర్డ్ బంగారం ధర ఎంసీఎక్స్‌లో 2 వేల రూపాయలు తగ్గింది. స్పాట్ మార్కెట్లో ధరలు ఇంకా తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెరికా సుంకాలకు దీటుగా చైనా సమాధానం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఏక పక్షంగా సాగిన వాణిజ్య యుద్ధం చైనా ప్రకటనతో ప్రపంచ యుద్ధంగా మారింది. ఎపుడు ఏ మార్కెట్ కూలుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.