84 డాలర్లకు చేరువలో క్రూడ్
అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం మానేశాయి. ఇపుడు వస్తున్న నష్టాలన్నింటిని భరిస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచడం మానేసిన తరవాత క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి గాడిన పడటంతో పాటు ఒపెక్ దేశాలు ఉత్పత్తి పెంచకపోవడంతో ఆయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డాలర్లో పెద్ద మార్పు లేకున్నా క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ క్రూడ్ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇవాళ అమెరికా వారాంతపు చమురు నిల్వల డేటా రానుంది. ఒకవేళ అంచనాలకు మించి నిల్వలు తగ్గే పక్షంలో… ఈవారంలోనే క్రూడ్ 85 డాలర్లను దాటే అవకాశముంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధరలు 83.65 వద్ద ట్రేడవుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేలోగా ముడి చమురు ధరలు తగ్గే అవకాశం కన్పించడం లేదు. సో… అసెంబ్లీ ఎన్నికల తరవాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు.