80 డాలర్లు దాటిన బ్రెంట్
పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకూ తీవ్ర కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు జెట్ స్పీడుతో పెరుగుతున్నాయి. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆరు వారాల గరిష్ఠ స్థాయిని దాటింది. ఇవాళ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లను దాటింది. గత వారం ఏకంగా 9 శాతంపైగా పెరిగిన బ్రెంట్ ఇవాళ ఏకంగా మూడు శాతంపైగా పెరిగింది. ఇజ్రాయిల్, లెబనాన్‌తోపాటు యెమన్ కూడా దాడులు ప్రారంభించడంతో ఇవాళ క్రూడ్ ధరలు పెరిగాయి. గత ఏడాది గాజాపై ఇజ్రాయిల్ దాడుల సమయంలో కూడా బ్రెంట్ క్రూడ్ 90 డాలర్లను తాకింది. దీని ప్రభావం భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై తీవ్రంగా పడనుంది. ధరలు పెరగడం అటుంచితే… అధిక స్థాయిలో ఎన్నాళ్ళు కొనసాగుతాయనేది కీలకంగా మారింది. క్రూడ్ అధిక ధరల కారణంగా అనేక పరిశ్రమలు కుదేలవుతాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే పక్షంలో… దాని ప్రభావం ఆర్థిక వృద్ధిరేటుపై పడుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్ వంటి మార్కెట్లపై తీవ్రంగా పడనుంది. ఒకవేళ ఇరాన్ ఆయిల్ క్షేత్రాలపై గనుక ఇజ్రాయిల్ దాడి చేస్తే… భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. రూపాయల్లో ఆయిల్ సరఫరా చేస్తున్న ఏకైక దేశం ఇరాన్. అక్కడి నుంచి సరఫరాకు ఆటంకం కలిగితే డాలర్లలో ఇతర దేశాల నుంచి భారత్ క్రూడ్ కొనాల్సి వస్తుంది. దీనివల్ల అనేక కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా తారుమారవుతాయి.