లాభాల స్వీకరణ మంచిది
గత శుక్రవారం నిఫ్టి 16,529 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి మద్దతు లేకుండానే నిఫ్టి ఈ రికార్డు స్థాయికి చేరడం విశేషమని ఏంజెల్ బ్రోకింగ్ (టెక్నికల్ అండ్ డెరివేటివ్స్)కు చెందిన , చీఫ్ ఎనలిస్ట్ సమీత్ చవాన్ అంటున్నారు. బీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ‘అదనపు ప్రైస్ బ్యాండ్’ భయాలతో ప్రారంభంలో కొద్దిగా దిద్దుబాటుకు లోనైనా, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలూ వారాంతంలో చాలా వరకు కోలుకున్నాయి. ఈ వారంలో కూడా మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదవుతాయా అంటే చెప్పడం కష్టమని చవాన్ అంటున్నారు. అదే సమయంలో మార్కెట్‌ను బలహీనపరిచే సంకేతాలూ పెద్దగా లేవని, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టుబడులనైనా వెనక్కి తీసుకోవడం అంటే లాభాలు స్వీకరించడం తెలివైన ఇన్వెస్టర్లు చేయాల్సిన పని అని ఆయన అంటున్నారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఈ వారం నిఫ్టీకి 16,400-16,300ను కీలక మద్దతుగా భావించాలని అన్నారు. అంతకంటే దిగువకు వస్తే మాత్రం 16,200-16,170లకు చేరే అవకాశముందని అన్నారు.