సరుకుల బిల్లుకూ ఈఎంఐ
మార్కెట్‌లో క్యాష్ కరిగిపోతోంది. కరోనా తరవాత ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు చితికిపోయారు. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచకపోవడం.. ఇదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా అప్పుల పాలయ్యారు. హిందుస్థాన్ లీవర్ వంటి కంపెనీ కూడా ఒక మోస్తరు ఫలితాలు సాధించలేకపోయింది. వీఐపీ ఇండస్ట్రీస్ వద్ద రూ. 700 కోట్ల స్టాక్ నిల్వ ఉందట. బజాజ్ ఆటో టూవీలర్స్‌కు కూడా డిమాండ్ అంతంత మాత్రమే. కాఫీ, టీ అమ్మే టాటా కన్జూమర్ షేర్ రూ. 1200 నుంచి రూ.1000లోపు వచ్చేసింది కొన్ని రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవడం కోసం కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నాయి. డిమార్ట్, స్టార్ వంటి స్టోర్స్ భారీ డిస్కౌంట్‌తో సరుకులు అమ్ముతుండగా… బ్లింకిట్ ఇపుడు బిల్లులపై ఈఎంఐ ఆఫర్ ఇస్తోంది. జొమాటొకు చెందిన ఈ కంపెనీ కొత్త ఆఫర్‌తో సేల్స్ పెంచుకునే యత్నం చేస్తోంది. తమ కంపెనీలో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈఎంఐ సదుపాయాన్ని కల్పించింది. ఇతర ఈఎంఐల మాదిరిగానే బంగారం, వెండి కొనుగోళ్లకు మాత్రం ఈఎంఐ ఆప్షన్ ఉండదని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం HDFC బ్యాంక్, ఎస్‌బీఐ, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కలిగిన వారికి ఈ ఆప్షన్స్ ఇస్తోంది.